*అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గానూ వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టనుంది. దీంతో ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్‌ఫ్లైట్ బయల్దేరనుంది. వర్జిన్ గెలాక్టిక్ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. జులై 11న ప్రయోగించే వాహక నౌకలో ఇద్దరు పైలట్లతో పాటు వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సస్, మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభించింది. అందులో ఒకరు శిరీష బండ్ల కాగా.. చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కాలిన్ బెన్నెట్ అంతరిక్ష యానం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు:-
శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో(తెనాలి) జన్మించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్తోన్న తొలి తెలుగు మూలాలున్న మహిళ ఈమే కావడం విశేషం. అంతకుముందు భారత్‌కు చెందిన కల్పనా చావ్లా, భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టారు.
బెజోస్‌కు పోటీగా
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఆయన తన సంస్థ బ్లూ ఆరిజిన్ ప్రయోగించే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక, బెజోస్ వెళ్లే తేదీ కంటే 9 రోజుల ముందుగానే ఈ ప్రయోగం జరగనుంది.

0 Comments